Swara online radio - playing now

"సాహితీ తీర్పరి" రావిశాస్త్రి

-బండారు రామ్మోహనరావు.

జూలై 30. సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రజా రచయిత, రాచకొండ విశ్వనాధ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

మీరు ఏ పనైనా మొదలు  పెట్టేముందు మీరు తలపెట్టిన ఆ పని వల్ల సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న పేదవారికి ఆ పని  ఏమైనా ఉపయోగ పడుతుందా అని ఒకసారి ఆలోచించిన తరువాతనే ఆ పని మొదలు పెట్టండి అన్నారు మహాత్మాగాంధీ. 

అలాగే రచయిత ఆయన ప్రతి వాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడుకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించి రాయాల్సిన అవసరం ఉందని ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అన్నారు. 

అలా ఆలోచించిన తర్వాతనే రచనకు ఉపక్రమించాలని తర్వాత తరాల రచయితలకు ఉద్భోధించిన రచయిత, సమాజంలోని అంతరాలు పోవాలని జీవితాంతం తన రచనల ద్వారా సమాజానికి సందేశం ఇచ్చిన  న్యాయవాది "సాహితీ తీర్పరి" రాచకొండ విశ్వనాథ శాస్త్రి. తర్వాతి తరం రచయితలకు మార్గదర్శిగా మారే ఈ మాటలను అన్నారు. మంచి కి హాని చెడ్డ కు సహాయము చేయకూడదని నేను భావిస్తాను అని అంటారాయన.

1922 జూలై 30న శ్రీకాకుళంలో లో పుట్టి పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడిన ప్రముఖ న్యాయవాది రావిశాస్త్రి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రావిశాస్త్రిగా ఆయన జీవితాంతం వరకు తన రచనల ద్వారా అంతరాల సమాజాన్ని బాగు చేయడానికి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ విరసం వ్యవస్థాపకులలో ఒకరుగా నిలిచారు. 

అన్యాయాన్ని ఎదిరించి నెలల తరబడి జైలు పాలై ప్రభుత్వ బిరుదులు అవార్డులు తిరస్కరించారు. పతితుల కోసం , భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడిన తమ్ముళ్ల కోసం తెల్లారకుండానే చల్లారుతున్న సంసారాల  కోసం, చీకటి ముసిరిన బ్రతుకుల కోసం రావిశాస్త్రి తన రచనల ద్వారా ప్రతిస్పందించారు. స్వతహాగా నిజ జీవితంలోనే న్యాయవాదిగా ఉన్న ఆయన అణగారిన వర్గాల వారి తరపున వకాల్తా పుచ్చుకొని సాహితీ న్యాయ పీఠం మీద తన కథలు కవితల ద్వారా వాదించారు. ఆ వాదనలో ఎవరి పక్షం నెగ్గాలో ఎవరి పక్షం వహించాలో స్పష్టంగా తనదైన రీతిలో ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఆ తర్వాత తానే తీర్పరి గా మారి న్యాయం, ధర్మం వైపు పక్షపాతం చూపించాల్సిందే అని ఘంటాపథంగా ఆయన తీర్పు చెప్పారు. 

తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళతామనే విధంగా ఆయన రచనలలో తనదైన విలక్షణమైన శైలి తో పాత్రలను తీర్చిదిద్దారు. సమాజంలో మనం రోజు చూస్తున్న పాత్రలే ఆయన నవలలు కథల్లో కనిపిస్తాయి. మన సమాజాన్ని ఉన్నదున్నట్టుగా ఆవిష్కరించి అందులోని కుళ్ళు, కుతంత్రాలను తాను వాడిన "గన్ను లాంటి" పెన్ను  లోని సిరాతోఉతికి ఆరేశారు, కడిగిపారేశారు. 

1627921626073

విలక్షణమైన రావిశాస్త్రి శైలి. ఆయనకు ఆయనే సాటి:

రావిశాస్త్రి రచనా శైలి వేరు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల మాండలికాన్ని ఆయన రచనలలో జోప్పించారు. ఉత్తరాంధ్ర ప్రజల భాషలోనే ఆయన రాశారు. ఆయన తీసుకున్న రచనా వస్తువు మనం రోజు చూస్తున్న సమాజమే. అందులోని పాత్రలు మనతో మాట్లాడతాయి. మనను నవ్విస్తాయి. మనను కవ్విస్తాయి. అంతిమంగా ఆ పాత్రల జీవన దైన్యం మనను ఏడిపిస్తుంది. చివరాకరికి  ధైర్యంతో ముందుకెళితే ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధమన్న ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. రచయిత రచన ప్రయోజనం అదే కదా! అందుకే ఆయన రచనలు ఈనాటికీ అజరామరంగా నిలిచాయి.

కాగితాల వెనుక జీవితాలున్నాయి:

జూనియర్ న్యాయవాది అన్నవాడు హోటల్లో మీల్స్ రెడీ లాగా కోర్టు ముందు అడ్వకేట్ రెడీ గా నిలవాలని యువ న్యాయవాదులకు ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఉదయాన్నే కోర్టు గేటు తెరుచుకునే సమయాని కంటే ముందు యువ న్యాయవాదులు కోర్టు ముందు ప్రత్యక్షమై సాయంత్రం కోర్టు గేట్లు పెట్టేసిన తర్వాత నే బయటకు వెళ్లాలని ఆయన అంటారు. అలాగే కిందిస్థాయి గ్రామీణ పట్టణ న్యాయస్థానాలలో జరిగే కేసు విచారణలో అక్కడ మనుషులు కనపడతారని వారు నిజం చెపుతున్నారా అబద్ధం చెబుతున్నారా అనే విషయాన్ని సాక్ష్యం చెప్పే వాడి ముఖకవళికలను బట్టి జడ్జిగారు సులభంగా కనుక్కోవచ్చు అని రావి శాస్త్రి గారు అంటారు.

కానీ కింది కోర్టులో ఓడిపోయిన వారు, గెలిచిన వారి మీద పై కోర్టుకు వెళితే అక్కడ మనుషులు కనపడరని కేవలం కాగితాలే మాట్లాడవలసి ఉంటుందని ఆయన పరిశీలన. అందుకే ఆ "కాగితాల వెనక జీవితాలు ఉన్నాయని" అంతకు పై కోర్టు లైన జిల్లా, హైకోర్టు ,సుప్రీంకోర్టు జడ్జీలు ఎప్పుడు తెలుసుకుంటారో అని ఆయన ఆవేదన పడ్డారు. కోర్టులో సమర్పించే ప్రతి కాగితం వెనుక వేలాది లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే అక్షరాలు ఉంటాయని ఆ అక్షరాలను జాగ్రత్తగా చదివి న్యాయాన్యాయాలు విచారించి తుది తీర్పు వెలువరించాలని జడ్జీలను హెచ్చరిస్తారు. న్యాయవ్యవస్థ లో జరుగుతున్న దుర్మార్గాలను అవినీతిని ఆయన తన రచనలలో ఎండగట్టారు.

పేదలే నేరస్తులు ఎందుకు అవుతున్నారు:

ఆస్తి తగాదాలను మినహాయిస్తే క్రిమినల్ కేసులలో కోర్టుకు వచ్చే వారు అందరూ సమాజంలో పేదలు నిమ్న వర్గాలకు చెందిన వారే అని ఆయన నిరూపించారు. క్రిమినల్ కేసులలో ఆ నేరాలకు కారణమైన సమాజాన్ని, దాని వెనుకనున్న అసలు దోషులను  పక్కనపెట్టి అత్యంత పేదలను ఆ కేసులలో ఇరికిస్తున్నారని ఆయన చాలా రచనల్లో తన పాత్రల ద్వారా ప్రత్యక్షంగా నిరూపించారు.

అనన్యమైన జీవనసారం "అల్పజీవి":

“కుళ్ళిన సంఘం, వయసు మళ్ళిన సంఘం” అంటూ సమాజంలోని అల్ప జీవుల జీవితాలను భూతద్దంలో పెట్టి సమాజానికి చూపించిన ఘనత రావిశాస్త్రి గారిదే. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావి శాస్త్రి 1952లో రచించిన అల్పజీవి చెప్పుకోదగ్గ రచన ప్రముఖ ఇంగ్లీష్ రచయిత "జెమస్ జాయిస్" అవలంబించిన రచనా పద్ధతి లో ఆ నవల రాశారు. మనసులోని ఆలోచనలను పైకి తన రచన ద్వారా చెప్పే "చైతన్య స్రవంతి" ధోరణి లో వచ్చిన మొదటి తెలుగు నవల అల్పజీవి. 

1627918837920

రావిశాస్త్రి రచించిన అనేక నవలల్లో కెల్లా ఉత్తమమైనది,అత్యంత ప్రజాదరణ పొందిన నవల అల్పజీవి. ఆయన  రచించిన మరికొన్ని కథలకు కూడా చైతన్య స్రవంతి శైలినే అనుకరించారు .రాజు మహిషి, రత్తాలు-రాంబాబు అసంపూర్తి నవలల నుండి మొదలుకొని 1960 లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మద్యపాన నిషేధం చట్టం తెచ్చిన మొదట్లో జరిగిన విపరిణామాలను దానివల్ల అనేకమంది పేదలు కోర్టు కేసుల్లో ఇరుక్కున్న సంగతిని అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు సమాజాన్ని మరింత ప్రభావితం చేశాయి. తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరినీ ఆలోచింపజేశాయి.

రాజకీయ పాలన అధికారంతో పాటు ధన మదo తోడైతే పాలక, భూస్వామ్య, వ్యాపార వర్గాలు పేదల పట్ల ఎలాంటి దుర్మార్గాలు చేస్తారో "నిజం" అనే నాటకంలో ఆయన అద్భుతంగా చిత్రీకరించారు.ఆయన చేసిన అనేక రచనల్లోని చాలా పాత్రలన్ని పేద వర్గాల నుంచి వచ్చిన వారి జీవితాలను ప్రతిబింబిస్తాయి. ఆయన రచనలు పేదల పక్షం వహిస్తాయి.

రావిశాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో బిఏ ఆనర్స్ చదివారు. మద్రాసు యూనివర్సిటీ నుంచి 1946 లో న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. తన తండ్రిగారైన శ్రీరామమూర్తి వద్ద న్యాయవాద వృత్తి లో మెళుకువలు నేర్చుకొని సొంత పార్టీ పెట్టుకున్నారు. మొదట్లో కాంగ్రెస్ వాదిగా ఉన్న రావిశాస్త్రి 1960 ప్రాంతాల్లో మార్క్స్ సిద్ధాంతాలకు ప్రభావితులయ్యారు. 1987 ప్రాంతంలో న్యాయవాద వృత్తిని స్వీకరించాక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించాడు. 

గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ నగర జీవితంలో ప్రజల జీవన, విధానంలో వస్తున్న పెను మార్పులను దగ్గరగా గమనించాడు. మాండలికాలతో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన మొదటి తరం తెలుగు రచయితలయిన గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి తర్వాత మాండలిక శైలిని రావిశాస్త్రి వాడినంత మరెవరూ వాడలేదు. శాస్త్రి రచనా పద్ధతి విలక్షణమైనది ఆ వరవడిలో ఆ తర్వాత వచ్చిన ప్రముఖ రచయిత్రి బీనాదేవి అచ్చంగా రావిశాస్త్రి గారి రాస్తున్నారా అన్నంత బాగా రాయ గలిగింది.

రచయిత లారా మీరు ఎటువైపు?

1970లో పశ్చిమ బెంగాల్ నక్సల్బరీ లో మొదలై అక్కడి నుంచి మన రాష్ట్రం వరకు విస్తరించిన నక్సల్బరీ ఉద్యమం లో "రచయితలారా మీరు ఎటువైపు" అంటూ విద్యార్థిలోకం తమ కరపత్రం ద్వారా రచయితలను సూటిగా ప్రశ్నించింది. దాంతో అప్పుడు విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. దానికి ఉపాధ్యక్షుడిగా రావిశాస్త్రి గారు ఉన్నారు. 

నక్సల్బరీ ఉద్యమం ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానంగా అన్నట్లుగా  రావిశాస్త్రి పాలకుల దుర్మార్గాలను దుష్ట కృత్యాలను తన రచనల ద్వారా ప్రశ్నించారు. తాను పాలక పక్షం వైపు కాదు ప్రజల పక్షానే నిలబడతానని  బహిరంగంగానే చాటారు.

1975లో ఎమర్జెన్సీ పీరియడ్లో ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టింది. ప్రభుత్వం ఇచ్చే అనేక అవార్డులు తిరస్కరించారు. తీసుకున్న అవార్డులను కూడా తృణప్రాయంగా భావించి మళ్లీ తిరిగి ప్రభుత్వానికి వాపస్ ఇచ్చారు. ఆయన రచనల లాగానే ఆయన జీవితం కూడా పోరాటపటిమ కలిగింది. 

ప్రజలకు తమ రచనల ద్వారా జ్ఞానోదయం కలిగించి భయాన్ని నిర్మూలించడమే రచయితల కర్తవ్యం అని త్రికరణ శుద్ధిగా నమ్మిన రావిశాస్త్రి చివరి వరకు ఆ లక్ష్యంతోనే రచనలు చేశారు. 1990వ దశకంలో "ఏడో చంద్రుడు" అనే నవల రాయడం ప్రారంభించి  పూర్తికాకుండానే చివరకి నవంబర్ 10 1993న తన 72వ ఏట మరణించారు. కానీ ఆయన రచనలకు మరణం లేదు. ప్రజా చైతన్యానికి మారుపేరుగా మారిన ఆయన రచనలు నేటికీ పాఠకులనుఆలోచింపజేస్తున్నాయి.

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge