Swara online radio - playing now

షర్మిల పార్టీ భవిష్యత్తు ఏమిటి?

కొత్త పార్టీలు కొన్ని చిక్కులు!!

-బండారు రామ్మోహనరావు.

రాజన్న రాజ్యం అంటే ఏమిటి? రాజన్నకు వారసులెవరు?

తెలంగాణలో పార్టీ పెట్టడానికి షర్మిల పాస్పోర్ట్, వీసా తీసుకున్నారా?

తెలంగాణ లో మరొక కొత్త రాజకీయ పార్టీ పుట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అనే పేరు మీద కొత్త పార్టీ పెట్టారు.ఇంతవరకు బాగానే ఉంది. దేశవ్యాప్తంగా కులము,మతము ప్రాంతము,భాషలకు అతీతంగా ఎవరైనా, ఎక్కడైనా ,ఎప్పుడైనా రాజకీయ పార్టీ స్థాపించవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఒక నాయకుడి పేరును కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు జోడించి పార్టీ పెట్టడం వల్ల ప్రజలకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుక వస్తామన్న షర్మిల మాటలకు ప్రజలు కొత్త అర్ధాలు వెతుకుతున్నారు.రాజన్న రాజ్యం అంటే ఏమిటి?.అది ఎలా ఉంటుంది?. గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని  పాలించిన రాజ్యం మళ్లీ తీసుకు వస్తారా?. అలాగే తెలంగాణ పట్ల ఆయన అవలంబించిన వైఖరిని మళ్లీ పునరుద్ఘాటిస్తారా?. గతంలో తెలంగాణ గురించి మాట్లాడిన మాటలను మళ్లీ నిజం చేస్తారా?. అని తెలంగాణ ప్రజలు కొత్త పార్టీ వ్యవస్థాపకురాలు షర్మిలను నిలదీసి అడుగుతున్నారు. మొదట రాజన్న సంక్షేమ రాజ్యం తీసుకువస్తామని అంటున్నారు. ఒకనాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఉండగా  వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇతరులకు 50 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటిని 200 రూపాయలకు పెంచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒకేసారి అమాంతంగా వెయ్యి రూపాయలకు పెంచారు.2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెన్షన్లు ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయలకు పెరిగాయి. వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు. ఇలా అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళు గా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర పరిపాలన షర్మిల చెబుతున్నట్లు రాజన్న రాజ్యం అంటే వెనకకుపోవడమేనా అనేది ఒక ప్రశ్న. ఇక రెండవది జలయజ్ఞం పేరుమీద ధనయజ్ఞం చేశారని వైయస్ పై ఆరోపణ ఉంది. మళ్లీ అలాంటి అవినీతికి చోటిస్తారా అనేది కూడా చెప్పాలి.

1625934427002

వీసా, పాస్పోర్ట్ తీసుకునే పార్టీ పెట్టారా?

ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆనాడు తెలంగాణ వ్యతిరేకిగా వైయస్సార్వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  తెలంగాణ ప్రాంత మంతా  తెలంగాణ ఉద్యమంతో అట్టుడుకుతున్న సందర్భంగా వేల మంది తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలు వదిలిన సందర్భంలో కూడా ఆ నాటి ముఖ్యమంత్రిగా వైయస్సార్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణ రానే రాదని మాట్లాడారు. ఆంధ్ర ప్రాంతంలో 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణలో ప్రచారం పూర్తయిపోయి ఆంధ్రలో ఇంకా మిగిలి ఉన్న సందర్భంగా తుంగభద్రా నది దాటి రాయలసీమలో అడుగుపెట్టగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యక్షంగా తెలంగాణను వ్యతిరేకించే మాటలు మాట్లాడారు.రాష్ట్రం ఒకవేళ విడిపోతే మనం తెలంగాణ వెళ్లడానికి వీసా ,పాస్పోర్టు తీసుకోవాల్సి వస్తుందని ఆంధ్ర ప్రజలను రెచ్చ కొట్టారు. ఇవాళ ఆ రాజన్న  రాజ్యాన్నే మళ్లీ తెస్తామంటున్న  షర్మిల వారి తండ్రిగారు అన్నట్లే తెలంగాణలో పార్టీ పెట్టడానికి పాస్పోర్టు, వీసా తీసుకొని వచ్చారా అని తెలంగాణ వాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆమె దగ్గర సమాధానం లేదు. అంతెందుకు ఆమె అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రలో తెలంగాణ ఏర్పడడానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సమైక్య ఆంధ్ర కు కట్టుబడి ఉంటానని స్పష్టంగా ప్రకటించారు. ఆ సందర్భంగా మహబూబాబాద్ లో ఆయన జరిపిన పాదయాత్రలో ఆయనపై పై రాళ్ల దాడి జరిగిన సంగతి అందరికీ తెలుసు. ఆయన పై అప్పటికే ఉన్న అవినీతి కేసులలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు గా జగన్మోహన్ రెడ్డికి చెల్లిగా జగనన్న విడిచిన బాణంగా తనను తాను అభి వర్ణించుకుంటూ షర్మిల తెలంగాణ  ప్రాంతంలో పాదయాత్ర కొనసాగింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనవసరం అన్న ఆమె ప్రస్తుతం తెలంగాణ గురించి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నది. గురివింద గింజ తన నలుపెరగదన్నట్లు తెలంగాణ పట్ల ఆమె మొదటి నుండి కపట ప్రేమ నటిస్తున్న సంగతి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ఉన్న అన్నా, చెల్లెలి కి ఉన్న ఆస్తులను రక్షించుకోవడానికి, ఆ ఆస్తులను మరింత పెంచుకోవడానికి రక్షణ గా ఉండడం కోసం రాజకీయం పార్టీ పెడుతున్నారని మరొక ఆరోపణ ఉంది. వీటికి ఆమె సమాధానం చెప్పాల్సి ఉంది.

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చనిపోయాక మొదట తన అన్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తాను  పాదయాత్ర చేసినప్పుడు గుర్తుకురాని తెలంగాణ ఉమ్మడిగా తాము వ్యతిరేకించిన తెలంగాణ ఇవాళ ఓట్ల కోసం కావాల్సి వచ్చిందా అని తెలంగాణ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం రావణకాష్టంగా రగులుతున్న నదీజలాల పంచాయతీ విషయంలో తాను తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా కట్టుబడి ఉంటానని ఒక్క నీటి చుక్క కూడా వారికి విడిచిపెట్టమనీ అటు పక్క తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి హక్కుగా లభించే నీళ్లను అడ్డుకోబోమని పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. గతంలో తెలంగాణ మీద విషం చిమ్మిన ఆ నోరే ఇవాళ తెలంగాణాలో తన పార్టీకి ఓట్ల కోసం మాట మారిస్తే ఎవరు నమ్ముతారు.

తెలంగాణకు పరాయివాళ్ళు ద్రోహం చేస్తే సరిహద్దు దాటి పారద్రోలుతామని అదే తెలంగాణ వాళ్లే ద్రోహం చేస్తే ఇక్కడే నిలువునా పాతి పెడతామని ప్రజా కవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ఆ స్పూర్తికి తెలంగాణ ప్రజలు నేటికీ కట్టుబడి ఉన్నారు.

రాజశేఖరరెడ్డి వారసత్వం ఎవరికి దక్కుతుంది:

కాంగ్రెస్ పార్టీలో మొదటినుండి కీలక నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి వారసత్వం నేడు తెలంగాణలో ప్రస్తుతమున్న కాంగ్రెస్ పార్టీ కి దక్కుతుందా?. లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు తల్లి కాంగ్రెస్ ను చంపి పిల్ల కాంగ్రెస్ వై ఎస్ ఆర్ సి పి పార్టీ వ్యవస్థాపకుడు రాజశేఖర్రెడ్డి తనయుడైన  జగన్మోహన్ రెడ్డి కి ఆంధ్ర ప్రజలు నీరాజనం పట్టినట్లు గానే షర్మిల కు పట్టం కడతారా అనేది తెలంగాణ ప్రజల విజ్ఞతకు వదిలేయాలి. అప్పటి దాకా రాజన్న రాజ్యం తెస్తామంటున్న కొత్త పార్టీ వ్యవస్థాపకురాలు షర్మిల తెలంగాణ ప్రజలు సంధించిన ప్రశ్నలకు అడుగడుగునా జవాబు చెప్పాల్సి ఉంటుంది.

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge