Swara online radio - playing now

ఫిరాయింపు రాజకీయాలకు మరణశాసనం రాయాలి

-బండారు రామ్మోహన రావు.

అనకొండ లాగా రాజకీయ పార్టీలనే మింగేస్తున్న టిఆర్ఎస్…. అన్ని పార్టీలదీ అదే దారి…

ఫిరాయించిన వారిపై వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉండాలి:

Eci1

దేశంతో పాటు వివిధ రాష్ట్రాలలో ఫిరాయింపు రాజకీయాలు సినిమాల సస్పెన్సును మించి రంజుగా సాగుతున్నాయి.136 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ తో సహా నాలుగు దశాబ్దాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ లు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపు రాజకీయాలవిషపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఊసుకు లేకుండా తుడిచిపెట్టుకు పోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీ లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీచేసిన ఎక్కువ శాతం స్థానాలలో డిపాజిట్ కోల్పోతుంది. 

Voting

తెలుగుదేశం రాజకీయ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అధికార టీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 19 మందిలో 13 మంది అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మిగిలిన ఆరుగురు బిక్కుబిక్కుమంటూ కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయారు. ఇక ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ టిఆర్ఎస్ పంచన చేరారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటినుంచి పార్టీలో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి రాష్ట్రంలో మంత్రి పదవి కూడా పొందారు. గత సంవత్సరం కాలంగా ఊగిసలాట లో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అధికారికంగా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఒక్కటే మిగిలింది. ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని తమ పార్టీలో  కలుపుకున్న టిఆర్ఎస్ పార్టీలకు పార్టీలనే అమాంతంగా మింగేస్తు రాష్ట్రంలో ఒక రాజకీయ అనకొండ లాగా మారిపోయిందని పరిశీలకులు విమర్శిస్తున్నారు.

ఆయారామ్, గయారామ్ సంస్కృతి ఇంకెన్నాళ్లు:

దేశంలో ఫిరాయింపుల రాజకీయం ఈనాటిది కాదు. ఏనాడో నాలుగు దశాబ్దాల క్రితమే హర్యానాలో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగినప్పుడు “ఆయారాం గయారామ్” సంస్కృతి పెద్ద ఎత్తున మొదలైంది. ఆ తర్వాత ఎవరైనా పార్టీ ఫిరాయించితే వారిని హర్యాన రాజకీయాలతో పోల్చేవారు.

తెలంగాణలో ఫిరాయింపుల పర్వం ఎప్పుడు మొదలైంది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా అప్పుడప్పుడు నాయకులు పార్టీ ఫిరాయించినానైతిక విలువలకు కట్టుబడి వారు రాజీనామా ఇచ్చేవారు.తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ సమయంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. టిఆర్ఎస్ పార్టీ నుండి 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చేరారు. అలాగే దేశంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో అప్పటి టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు కరీంనగర్ ఎంపీ గా గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తన ముఖ్య సహచరుడైన సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర తో కలసి కేంద్ర మంత్రివర్గంలో చేరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మిత్ర ధర్మాన్ని పక్కనపెట్టి కొందరు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.ఆ తర్వాత నుండి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపుల రాజకీయం పెద్ద ఎత్తున మొదలైంది.ఆ తర్వాత రెండుసార్లు తెలంగాణలో ఉద్యమం కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ప్రతిసారి అందులో కొందరు గెలిచి, మరికొందరు ఓడిపోయారు.  2009 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లో మళ్లీ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కూడా ఈ ఫిరాయింపు రాజకీయాలను ఎక్కువగా ప్రోత్సహించారు.రాష్ట్రం విడిపోయే వరకు ఈ డ్రామా కొనసాగింది.తర్వాత 2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయింది. అప్పటినుండి రెండు రాష్ట్రాల రాజకీయ యవనికపై కొత్త చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది.అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు.తల్లి కాంగ్రెస్ పార్టీని చంపి పిల్ల కాంగ్రెస్ పార్టీ బతికింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 69 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అందులో ఎన్నికలు జరిగిన సంవత్సరంలోపే 23 మంది వై ఎస్ ఆర్ సి పి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశానికి ఆ ఫిరాయింపుల శాపం తగిలింది. సరిగ్గా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. అందులో నుంచి కూడా మరికొందరు వైయస్సార్ సిపి పార్టీ లో చేరి పోయారు.

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్:

1626030498902

ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 స్థానాల లో 2014 లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 63 స్థానాలు గెలిచి కొద్దిపాటి మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. 2014 లో తెలుగుదేశం పార్టీకి 12 స్థానాలు లభించాయి.కాంగ్రెస్ పార్టీకి మరో 21 స్థానాలు లభించాయి. మజ్లిస్ పార్టీకి మామూలుగానే 7 స్థానాలు దక్కాయి. ఇక బీజేపీకి ఐదు స్థానాలు లభించాయి. ఇలా భిన్న పార్టీల కాంబినేషన్ లో తెలంగాణ రాష్ట్రం మొదటి అసెంబ్లీ ఏర్పడింది. కానీ ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేల లో సగం మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ఆకర్షించింది.ఆ తర్వాత  టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వరుసబెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అలా కాంగ్రెసు, టిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీలోకివచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా దక్కాయి. చివరికి సిద్ధాంతపరంగా బలంగా ఉండే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి కూడా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ టిఆర్ఎస్ పార్టీలో చేరడం కమ్యూనిస్టులకు కూడా ఎదురు దెబ్బ అయింది. అలా 2019 ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం బాగా మారింది. రాష్ట్రంలో టిఆర్ఎస్ బలపడింది. ఎనభై అయిదు అసెంబ్లీ సీట్లకు పైగా గెలిచి రెండవసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు.ఇక కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. బిజెపికి ఉన్న ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలలో ఓడిపోయి ఒకే ఒక స్థానం మిగిలింది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ఒక్కరే బిజెపి తరఫున గెలిచారు. ఆ తర్వాత సంవత్సరం లోపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లో 13 మంది టిఆర్ఎస్  లో చేరిపోయారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ టీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల చరిత్ర.

ఫిరాయింపు రాజకీయాల రారాజు బిజెపి:

ఇక దేశంలో పదేళ్ల యుపిఎ పాలన కు చరమగీతం పాడుతూ 2014లో కేంద్రంలో బిజెపి పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ రాజకీయాలనే అచ్చంగా పునికి పుచ్చుకొని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ఎమ్మెల్యేలను ఎంపీలను తన బిజెపి తన పార్టీలో చేర్చుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రాలకు రాష్ట్రాలలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ద్వారా బిజెపి ఆయా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది. ఈశాన్య రాష్ట్రాల తో సహా దేశంలో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ నుండి మొదలుకొని చాలా రాష్ట్రాలలో బిజెపి ఈ పార్టీ ఫిరాయింపుల ప్రయోగం చేసి సఫలమైంది. మరికొన్ని రాష్ట్రాలలో విఫలమైంది. ఇలా కింది నుంచి పై దాకా రాష్ట్రాల నుంచి కేంద్రం దాకా అన్ని పార్టీల ది అదే దారి అయింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ కాంగ్రెస్ పార్టీని బిజెపి వెక్కిరిస్తుంది.

1626030440637

ఫిరాయింపుదారులు  చెబుతున్న కారణాలేమిటి?

ఈ మొత్తం పార్టీ ఫిరాయింపుల చరిత్ర గమనిస్తే ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పార్టీ ఫిరాయింపును సమర్థించుకోవడానికి  అనేక కారణాలు చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమేనని  దేశ రాజకీయాలను మార్చడం కోసమని అనేక కారణాలు చెబుతున్నారు. “తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే  దూడ గడ్డి కోసమన్నట్లు” వీరు సాకులు చెబుతున్నారు.నాయకులు పార్టీ ఫిరాయింపు దేశ అభివృద్ధికి ఎంత మాత్రము కాదని తమ వ్యక్తిగత అవినీతిని కొనసాగించడానికే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీ లలో చేరుతున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. పార్టీలు కూడా తమ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర పార్టీలోకి ఫిరాయించినప్పుడు తాము నష్ట పోయినపుడు ఎదుటి పార్టీలపై శాపనార్ధాలు పెడుతున్నారు. అదే తాము అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నారు.అప్పుడు బాధిత పార్టీలు షరా మామూలుగా స్పందిస్తున్నాయి. ఇలా అన్ని పార్టీలు ఎప్పుడో ఒకసారి పార్టీ ఫిరాయింపుల బారినపడి బాధితులు అవుతున్నారు.

ఫిరాయింపు సవాళ్ళను విసురు కుంటున్న రేవంత్ వర్సెస్ టిఆర్ఎస్:

1626030385673

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలను సంతరించుకోవడానికి తెలుగు దేశం పార్టీ లో కీలకమైన నాయకుడిగా ఉండి ఆ తర్వాత 2017 లో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన రేవంత్ రెడ్డిని సొంత పార్టీ వారితో సహా అధికార టీఆర్ఎస్, బిజెపి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఒక దశలో కాంగ్రెస్ సొంత పార్టీ ఎమ్మెల్యే కీలక నాయకుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి గురించి వ్యాఖ్యానిస్తూ టిడిపి, టి పి సి సి గా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని అన్నారు. అలాగే టిఆర్ఎస్ యువ నాయకుడు ముఖ్యమంత్రి వారసుడుగా చెప్పబడుతున్న కల్వకుంట్ల తారకరామారావు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి పై అదే విమర్శను చేశారు. దానికి స్పందించిన రేవంత్ రెడ్డి ధీటైన జవాబు ఇచ్చారు. అందులో చాలా నిజం ఉంది.టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర రావు మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుండే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కొద్ది రోజుల్లోనే టిడిపి వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన రాజకీయాల్లో అనేక పదవులు పొందారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీలో ఉండే ఏడు సార్లు గెలిచారు. రెండుసార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్ గా కూడా ఆ ప్రభుత్వంలో పని చేశారు. అలాంటిది టిఆర్ఎస్ పార్టీ కూడా టిడిపి మూలాలు ఉన్నదే కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే 2019 తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల లో సగం మంది కంటే ఎక్కువే టిడిపి లో కీలకమైన పదవులు అనుభవించిన వారే కదా అని ఆయన ప్రశ్నించారు. అలా చూస్తే ప్రస్తుత మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్,  చామకూర మల్లారెడ్డి,  ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి డి తో పాటు గతంలో మంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తో సహా తెలుగుదేశం పార్టీ నాయకులే కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఒక్కడినే టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చాను. కానీ ఇంత మందిని చేర్చుకొని పార్టీ వ్యవస్థాపకుడు టిడిపి నుంచి వచ్చిన వారు కనుక టిఆర్ఎస్ పార్టీ కూడా టిడిపి మూలాలు ఉన్నదే కదా అని రేవంత్ రెడ్డి అంటున్నారు.ఇలా పార్టీని ఫిరాయించిన నాయకులపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ కు అధికారం ఉంది. కానీ చాలాసార్లు రాష్ట్ర శాసనసభ లేక లోకసభ స్పీకర్ ఇలాంటి వివాదాలపై సరైన నిర్ణయం తీసుకోలేక పోవడం వల్ల ఏళ్ల తరబడి ఫిరాయింపు దారులు తమ పదవుల్లో సురక్షితంగా కొనసాగుతున్నారు.

పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులు రావాలి:

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల తో సహా దేశవ్యాప్తంగా ఈ ఫిరాయింపు రాజకీయాలపై ప్రజలలో అసహ్యం కలుగుతుంది. ప్రస్తుతం ఒక నాయకుడు ఏ పార్టీలో  ఉన్నారనేది గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఇలా ఈ ఫిరాయింపుల రాజకీయాలలో పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాలంటే ఫిరాయింపు చట్టాన్ని మార్చాల్సి ఉంది. ప్రస్తుతం శాసనసభ,శాసన మండలి,లోక్ సభ,రాజ్యసభ స్పీకర్ లకు ఉన్న ఈ అధికారాన్ని పూర్తిగా ఎన్నికల కమిషన్ కు అప్పగించాలి. ఒక పార్టీ “బి” ఫారం మీద ఎన్నికైన వారు ఆ పార్టీ నుండి రాజీనామా చేసినా లేక పార్టీ వారిని  సస్పెండ్ చేసిన సందర్భంలో వెంటనే ఎన్నికైన ఆ పదవి పోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఫిరాయింపుల కు కళ్లెం  పడుతుంది. లేకపోతే బాధిత పార్టీలు ప్రజాస్వామ్య ప్రియులైన పౌరులు చేసే అభ్యంతరాలకు విలువ ఉండదు. ఆటగాళ్లు మారడం కాదు ఆట నియమాలు మారినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బ్రతక కలుగుతుంది.

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge