Swara online radio - playing now

కాయకల్ప చికిత్స కాదు సమూల ప్రక్షాళన

-బండారు రామ్మోహనరావు.

మారాల్సింది ఎవరు మూలవిరాటా ఉత్సవ విగ్రహాలా?

 

కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై భిన్నాభిప్రాయాలు:

ఎన్నాళ్లో వేచిన ఉదయం పాటలాగా ఆశావహులకు ఆనందం కలిగిస్తూ మరికొందరికి నిరాశ కలిగిస్తూ ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది.   దీన్ని మంత్రివర్గ విస్తరణ గా చెప్పవచ్చా లేక ప్రక్షాళన గా అనాలా అనేదానిమీద చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రి వర్గం లో 77 మంది మంత్రులను చేర్చుకొని జంబోజెట్ మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అయిననూ మరికొందరు హస్తినకుపోవడానికి పుష్పక విమానం లాగా మంత్రివర్గంలో మరొక 4 బెర్తులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.

1952 తర్వాత ఇప్పటివరకు జాతీయ ప్రభుత్వం లో ఏర్పడిన మంత్రివర్గంలో నుండి మంత్రివర్గ విస్తరణ పేరుమీద  సమగ్ర ప్రక్షాళన జరిపి పన్నెండు మంది మంత్రులు ఒకేసారి తొలగించడం ఇదే మొదటిసారని అంటున్నారు. అందుకే దీన్ని మంత్రివర్గ విస్తరణ  ఎంత మాత్రము కాదు సమూల ప్రక్షాళన అని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సామాజిక సమీకరణాల కు పెద్ద పీట:

యువతకు, మహిళలకు, దళితులకు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన మంత్రివర్గంగా దీన్ని చెప్పుకోవచ్చు. 43 మందిని కొత్తగా మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా 12 మంది మహిళలకు 12 మంది ఎస్సీలకు మరొక 8 మంది ఎస్టీలకు మరికొందరు బలహీనవర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చి సామాజిక సమీకరణల లో మోడీ మార్కులు కొట్టేశారు. ఇక తొలగించిన మంత్రుల విషయంలోకి వస్తే తనకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు మంత్రులు కూడా తొలగించడంతో కొత్త వారితో పాటు ప్రస్తుతం మంత్రివర్గాల్లో కొనసాగుతున్న వారికి ఒక హెచ్చరిక లాగా ఆయన ఈ మంత్రివర్గ విస్తరణ నువ్వు ఒక ఉదాహరణ గా చూపించారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖ నిర్వహించిన ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, లతోపాటు మరిన్ని కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న ప్రకాష్ జవదేకర్, సదానంద గౌడ లాంటి వారికి మంత్రివర్గం నుండి ఉద్వాసన పలకడంతో మోడీ తన మంత్రివర్గ సహచరులతో పాటు పార్టీకి ఇవ్వాల్సిన సంకేతాలను సూటిగానే  ఇచ్చారని అర్థమవుతుంది. ఆరోగ్య రంగంలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోలేదనే ఆరోపణతో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ను తీసివేశారా?. నూతన విద్యా విధానం ప్రకటించిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లో విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ విఫలం అయ్యారా?. ఐటీ శాఖ సమర్థవంతంగా నడిపకుండా సోషల్ మీడియా లో మోడీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు ప్రచారం కావడాన్ని అరికట్టడంలో ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విఫలమయ్యారా?. అనే ఈ ప్రశ్నలకు జవాబులు కేవలం ప్రధానమంత్రి మోడీ వద్దనే ఉన్నాయి. ఆయన వీరందరి సేవలను ముందు ముందు బిజెపి పార్టీ సంస్థాగత విషయాలకు వినియోగించుకుంటారా లేక వారిని పక్కన పెడతారా అన్నది మోడీగారి ఇష్టం.

మంత్రివర్గ విస్తరణ ప్రధాని ఇష్టమే:

మన భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల లో ముఖ్యమంత్రులు, దేశంలో ప్రధాన మంత్రి తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకోవడంలో పూర్తి స్వేచ్ఛ కలిగి ఉన్నారు.వారి ఇష్టానుసారం వారి మంత్రివర్గం కూర్పు చేసుకోవచ్చు. దాని ప్రకారమే ప్రధాని నరేంద్ర మోడీ తీసేయ తలచుకున్న మంత్రులను సున్నితంగా పక్కన పెట్టారు. తాను కొత్తగా తీసుకోవాల్సిన వారిగా భావించిన వారిని రెడ్ కార్పెట్ వేసి కొత్తగా మంత్రివర్గ శాఖలను కేటాయించారు. ఇది ఏ ప్రభుత్వం లో నైనా, ఏ పార్టీ వారు ఉన్నా సహజంగా జరిగేదే. కానీ మంత్రివర్గ విస్తరణ లేక ప్రక్షాళన అనే అంశం మీద దేశవ్యాప్తంగా కొన్ని విమర్శలు వస్తున్నాయి.

అంతా మీరే చేశారు మోడీ:

Modi

ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 ప్రభుత్వాల సారధిగా ప్రధానమంత్రిగా గత ఏడు సంవత్సరాలుగా జాతీయ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ ద్వారా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తన వైఫల్యాలను తన మంత్రివర్గ సహచరుల మీద వేస్తున్నారని ఈ మంత్రివర్గ విస్తరణ ద్వారా ఒక అపవాదు మూట కట్టుకున్నాడు. “విజయానికి ఎందరో తండ్రులు అపజయం అనాధ “అనే సామెతను అనుసరించి ఈ ప్రభుత్వాలలో జరిగిన మంచి ఏదైతే ఉందో దానివల్ల విజయం లభించిందో మోడీఆ విషయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని, అదే అపజయం అయినప్పుడు దాన్ని మంత్రుల మీద చుట్టి వేస్తున్నారని ఆయనను విమర్శిస్తున్నారు. మోడీ మంత్రివర్గాన్ని మార్చడమే కాదు తనను తాను కూడా మార్చుకోవాలని కొందరు విమర్శకులు అంటున్నారు. ప్రధానమంత్రి మంత్రులను మార్చడమే కాదు తాను మంత్రివర్గంలోకి తీసుకునే మంత్రులకు సరైన విలువ కూడా ఇవ్వాలని కూడా వారు అంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మూలవిరాట్టుగా కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఆయన జతగాడు పార్టీ ముఖ్య నాయకుడు అమిత్ షాలను మూల విగ్రహాలుగా చెప్పుకోవచ్చు. ఉత్సవ విగ్రహాలు అయిన మంత్రు లను ఎంతమందిని మారిస్తే ఏమిటి అసలు మూల విగ్రహాలు మారకుండా అనే తీవ్రమైన విమర్శ కూడా నరేంద్ర మోడీ ఎదుర్కొంటున్నాడు. ఇది గిట్టనివారి అనే మాట అని బిజెపి తేలిగ్గా కొట్టి పారేస్తుంది. మోడీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఏర్పడిన తమ మంత్రి వర్గం సమర్థవంతమైన మంత్రివర్గం గా బిజెపి పార్టీ అభివర్ణించింది.

సమస్యను గుర్తించారు పరిష్కారం సాధించాలి:

మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణ ద్వారా నరేంద్ర మోడీ ఒక విషయాన్ని తేటతెల్లం చేశారు.గత రెండేళ్ల కాలంలో తాను ఏ పొరపాట్లు చేశారో వాటిని ఆయన గుర్తించారనేది తెలిసింది. సమస్య గుర్తించారు సరే కాని దీనికి పరిష్కారం మంత్రివర్గ విస్తరణ లో ఉందని ఆయన అనుకున్నారు. ఆయన అనుకున్న పరిష్కారం సరైందేనా అనేది వచ్చే మూడేళ్లలో తేలుతుంది. ఇంకా మోడీ గారి మాటల్లో చెప్పాలంటే ఈ విస్తరణ ఇక్కడితో ఆగదని, ఇది నిరంతరం జరుగుతూ ఉంటుందని ఆయన అన్నారు. అంటే మంత్రివర్గంలో చేరడానికి ప్రయత్నిస్తున్న ఆశావహులకు ఇంకా ద్వారములు తెరిచి యున్నవి అనే సంకేతాన్ని మోడీ ఇచ్చారు.

ఉత్తర దక్షిణ భారతాల విభజన జరిగిందా?

77 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ద్వారా దేశంలో ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య వివక్ష స్పష్టంగా కనిపించిందని మరి కొందరు అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ లేక బిజెపి పార్టీ రాజకీయ సన్యాసం పుచ్చుకొని ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ పార్టీ కూడా ఒక పని చెయ్యదు. అందులో భాగంగానే బిజెపికి దక్షిణ భారతదేశంలోని నాలుగు ఐదు రాష్ట్రాలలో పెద్దగా రాజకీయ ప్రయోజనాలు లేవు. మరి అలాంటప్పుడు ఆ రాష్ట్రాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే లాభం ఏమిటి అనేది కూడా ఆలోచిస్తారు. అలాగే ఉత్తర భారతదేశంలో వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పంజాబ్ , మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పీట వేసి ఏడుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది రాజకీయ వ్యూహం. దీని కాదనే వారెవరు . అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మంత్రి పదవులను ఆశించే వారు ఆశించారు. కానీ ఇందులో పెద్దగా ఆశించడానికి ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణలో బిజెపి పార్టీకి నలుగురు ఎంపీలు ఉండగా ఇప్పటికే సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి క్యాబినెట్ హోదాకు ప్రమోషన్ ఇవ్వడం పెద్ద మార్పు. మరొక గిరిజన  ఎంపీ కి మంత్రివర్గంలో స్థానం దక్కుతుం దేమోనని ఆశ పడడం సహజమే కానీ దక్కలేదు .ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే  ఆ పార్టీ ఏపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు ,బిజెపి సీనియర్ నాయకులు కంభంపాటి హరిబాబు గవర్నర్ కు గవర్నర్ గిరి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కొంతవరకు సంతృప్తి పరిచినట్లు అయింది. ఇప్పటికే ఆ రాష్ట్రం నుండి దేశంలో రెండవ ప్రధాన రాజ్యాంగ పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అధిష్టించి ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉండి ప్రస్తుతం హర్యానా లాంటి మరొక పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా బదిలీ చేయబడ్డారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాలకు ఇంతకంటే గౌరవం దక్కాలనిబిజెపి వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యర్థి పార్టీలను, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికేనా?

మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి బీజేపీకి అధికారం కట్టబెట్టిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత బిజెపి నాయకులు జ్యోతిరాదిత్య సింధియాలాంటి వారిని మంత్రివర్గంలో తీసుకోవడం అనేది రాజకీయ వ్యూహంలో భాగమే. ప్రత్యర్థి పార్టీల దెబ్బ కొట్టడమే కాకుండా ఆ పార్టీలను చీల్చి తన బలాన్ని పెంచుకునే వ్యూహం రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా చేస్తుంది. అలాగే చిన్నాచితకా పార్టీలను కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడం కూడా ఇందులో భాగమే. శత్రుశేషం రుణ శేషం ఉంచుకోవద్దనుకున్న మోడీ ప్రతి రాష్ట్రంలో తమ రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేశారు. ఇది సహజమే. బీహార్ లాంటి రాష్ట్రాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన చిరాగ్ పాశువాన్ మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఎదురుతిరిగారు. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ పార్టీలో అసమ్మతి నేత గా చిరాగ్ పాశ్వాన్ తో విభేదిస్తున్న ఆయన చిన్నాన్న రామ్ విలాస్ పాశ్వాన్ తమ్ముడు పరస్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా తనను వేధించే వారికి మోడీ ఒక హెచ్చరిక పంపారు.

ఇక అంతిమంగా ఈ మంత్రివర్గాన్ని మరొకసారి విశ్లేషిస్తే రాజకీయాల్లో తన మన అనే వారు ఎవరూ ఉండరని రాజకీయ అవసరాలు అవకాశాలే ప్రాధాన్యత వహిస్తారని మోడీ బహిరంగంగానే చెప్పారు. ఈ మాటల్లో దాపరికం ఏమీ లేదు కానీ మోడీ ఎప్పుడు మాట్లాడే మినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమం గవర్నెన్స్ అనే పదానికి ఈ జంబో జెట్ మంత్రి వర్గ కూర్పు సరిపోదేమో అని విమర్శకులు అంటున్నారు. అంతిమంగా మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్న వారితో సహా శాఖను మార్చడం కాదు, బాధ్యతలు అప్పగించి స్వతంత్రంగా సమర్థతతో పని చేయించి నప్పుడు మాత్రమే  వారి లో ఉన్న సామర్థ్యం బయటపడుతుందని మోడీపై విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది నిజమే కదా. తప్పనిసరిగా మోడీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

One Comment

Your email address will not be published. Required fields are marked *

  1. మీ రాజకీయ అనుభవం అధ్యయనాలు చాలా విశ్లేషణ తో రాజకీయ సామాజిక అభివృద్ది కోసం ఉపయోగించే విధంగా ఉన్నాయని నా అభిప్రాయం.

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge