Swara online radio - playing now

ఉగాదికే ఉషోదయం

విభజన రేఖలను చెరిపి వేయాలి.వసుధైక కుటుంబకం నిలిచి గెలవాలి.

-బండారు రామ్మోహనరావు.

అందరూ క్రేజీ నెంబర్ గా మోజుపడిన 2020 సంవత్సరం అనేక సంచలనాలకు మారు పేరుగా మారి ముగిసిపోయింది. Covid 19 పేరుమీద మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మానవ జీవితంలో కూడా 2020 క్రికెట్ మ్యాచ్ ఆడింది. 2020 వన్డే మ్యాచ్ లాగే ముగిసిపోతుందనుకుంటే కనీసం టెస్ట్ మ్యాచ్ లాగా కూడా సాగకుండా సంవత్సరాంతం వరకు కొనసాగుతూనే ఉంది . వచ్చే నూతన సంవత్సరం 2021 లో కూడా “వదల బొమ్మాలీ వదల”అంటూ మనను అంటిపెట్టుకునే ఇంకా అలాగే ఉంటానంటుంది.గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనే నానుడిని పూర్తిగా తిరగరాసింది.గత కాలం కంటే వచ్చే కాలమే మేలు గా ఉండాలని మనందరం కోరుకునేలా చేసింది.

కాలానికి కొలతలేవి?

భూత వర్తమాన భవిష్యత్ కాలాల సమాహారమే కాలం. కాలానికి ఆది అంతం లేదంటారు. మనం లెక్క పెట్టుకుంటున్న లెక్కలు అన్నీ కూడా కొద్దికాలానికే పరిమితం. నేటి వర్తమానం ,రేపటికి చరిత్ర గా మారిపోతుంది. రేపటి భవిష్యత్తు నేటి వర్తమానంగా కొనసాగుతుంది. ఇది కాలం ఉన్నంత కాలం సాగిపోతూనే ఉంటుంది. మనిషి ఆశాజీవి. ఎప్పటికప్పుడు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఆశ పడుతూ బతికేస్తుంటారు. అందుకే చాలామంది వర్తమానంలోనే బ్రతుకుతూ భవిష్యత్ పట్ల ఆశతో ఉంటారు.  గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటూ నిరాశ నిస్పృహ తో కూడా కొందరు ఉంటారు. అలాంటి వారిని మార్చడానికి మనసు కవి ఆత్రేయ “ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మాన్పేది మరుపు” అని ఉపదేశించారు.

కరోనా వేదాంత సారాన్ని కాచి వడపోసిన 2020:

“కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం రెప్పపాటు జీవితం” అన్నాడో కవి. అచ్చంగా 2020 సంవత్సరం కన్నుమూసి తెరిచేలోగా గడిచిపోతుందనుకుంటే బహు భారంగా బాధగా గడిచింది. ప్రపంచ ప్రజల జీవితాలలో పెను మార్పులు చోటు చేసుకునేలా సాగింది. ప్రపంచ ప్రజల జీవితాలలో అతి తీవ్రమైన ప్రభావం చూపించిన సంవత్సరంగా 2020 ప్రపంచ చరిత్రలోనే ఒక విషాద సంవత్సరంగా మిగిలిపోయింది. మానవ సంబంధాలలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక ,రాజకీయ,సామాజిక సంబంధాలలో అనేక మార్పులు వచ్చాయి. తృణప్రాయమైనఈ జీవితం కోసం మనం ఎన్ని కర్ర సాములు,కత్తి సాములు చేస్తున్నామో ప్రపంచ మానవాళికి  అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కరోనా మహమ్మారి కబంధహస్తాల్లో ఇరుక్కొని బాధ పడ్డారు. లక్షల సంఖ్య లో మరణించారు. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయారు. ప్రపంచంలోని పేదా గొప్ప తారతమ్యాలు లేకుండా కరోనా వైరస్ అందరినీ కబలించింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ప్రపంచ డిక్షనరీ లో అన్ని భాషలలో కొన్ని కొత్త పదాలు చేరాయి. covid 19, కరోనా, లాక్ డౌన్, కంటైన్మెంట్ లాంటి పదాలు బహుళ ప్రచారం పొందాయి. ప్రపంచంలోని అన్ని భాషలలో ఈ పదాలు ఎక్కువసార్లు వాడిన పదాలు గా రికార్డులకెక్కాయి. అన్ని రంగాలు కుదేలు అయిపోయినా కూడా వ్యవసాయ రంగం మాత్రం నిలిచి గెలిచింది. ప్రకృతి ఎవరికోసం ఆగదని ఈ కరోనా కష్టకాలం నిరూపించింది. ప్రకృతి ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో ఈ సంవత్సరం మనకు కళ్లకు కట్టినట్లు కనిపించింది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వరుస ప్రమాదాలు తెచ్చిపెట్టాయి. పంచభూతాలు ప్రకోపించిచాయి. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, అగ్నిపర్వతాలు పేలడం, ఆకాశంలో గ్రహాల సంయోగం జరిగింది. దానివల్ల అనేక దుష్ఫలితాలు వస్తాయని హెచ్చరించడం జరిగింది. శాస్త్ర విజ్ఞానం దీన్ని కొట్టిపారేసింది. వాతావరణ కాలుష్యం వల్ల వాయు కాలుష్యం ఏర్పడి నగరాలకు నగరాలే మసకబారాయి. బాధ పడ్డాయి. అలాగే చివరగా అనేక పట్టణాలలో వరదలు వచ్చి నగర జీవితం అస్తవ్యస్తమైంది. “అర్బన్ ఫ్లడ్స్” అనే కొత్త పదం మరొకసారి వెలుగులోకి వచ్చింది. మానవ జీవితంలో తత్వచింతన పెరిగింది. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందన్న గురజాడ అప్పారావు గారి మాట నిజమైంది. జీవిత సత్యాన్ని అవపోసన పట్టిన పాటలు కూడా మనకు గుర్తొచ్చాయి. “దేక్ తేరా సన్ సార్ కి హాలత్ క్యా హోగయి భగవాన్, కిత్నా బదల్ గయా ఇన్సాన్, కిత్ నా బదల్ గయా ఇన్సాన్, సూరజ్ న బదలా, చాంద్ నా బదలా, నా బదల్ రే ఆస్మా, కిత్నా బదల్ గయా ఇన్సాన్” అనే పాట అందరి నోళ్లలో నానింది.ఇంత ఉపద్రవం లోనూ మనిషి “వెనుకటి గుణమేల మాను” అన్నట్లు అన్ని రకాల వేషాలు వేశాడు. మోసాలు కూడా చేశారు. కరోనా కష్టకాలంలో గుండమ్మ కథ సినిమాలోని  వేషము మార్చెనూ భాషను మార్చెనూ! మోసము నేర్చెనూ!! అసలు తానే మారెను!!!. అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. అన్న పాట గుర్తుకొస్తుంది. ఘోరా రణ్యములాక్రమించెను, క్రూరమృ గమ్ముల కోరలుపీకెను వేదికలెక్కిను, వాదము చేసెను. అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు. పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను, అన్నట్లు ఎంత తత్వచింతన పెరిగినా కూడా చివరికి బతుకుదెరువుకోసం ఎదుటి వారిని మోసం చేసే గుణం మాత్రం మారలేదు.అనేక ఆర్థిక కుంభకోణాలకు సామాజిక దురాచారాలను పురికొల్పడం లోఏ మాత్రము వెనుకకు పోలేదు.మహిళల పై హింసకు పూనుకున్నారు. కరోనా కష్టకాలంలో గృహహింస కూడా పెరిగింది అనేది ఒక వాస్తవం.

కళ్ళముందే కదిలిన వలసల భారతం:

1947లో భారత దేశవిభజన తర్వాత భారత్ పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య లక్షల సంఖ్యలో వలసలు పోయినట్లే దాన్ని మించిపోయి దేశమంతా వలస కార్మికుల నడకతో దేశ రహదారులన్నీ పేదల వలస కార్మికుల రక్తంతో తడిచాయి. దానికి రైలు పట్టాలు కూడా మినహాయింపు ఏమీ కాదని పదుల సంఖ్యలో వలస కార్మికులు పట్టాల మీదనే ప్రాణాలు విడిచారు. దేశ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న దిక్కు మొక్కు లేని వలస కార్మికులు ఈ కరోనా కష్టాలు అనుభవించిన అంత కష్టం మరి ఎప్పుడూ అనుభవించలేదు. మానవ విషాదం అంటే ఇదేనేమో.

అంతరిక్షంలో శాస్త్ర విజ్ఞానం, పాతాళంలో ప్రపంచ రాజకీయాలు:

ఈ కరోనా కష్టకాలంలో శాస్త్ర విజ్ఞానం అద్భుతంగా పెరిగింది. దాని ఉపయోగాలు కూడా మనకు నిత్యజీవితంలో అనుభవంలోకి వచ్చాయి. విద్యా వైద్య,ఉపాధి రంగాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.  మనుషులు భౌతికంగా దూరంగా ఉన్నా నేడు అందుబాటులో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ మన పనుల ను మరింత సులువుగా చేసి పెట్టింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రపంచాన్ని ఇంకా దగ్గరకు చేర్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు మరింత చేరువైంది.భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మానవ జీవితంలో మరిన్ని అద్భుతమైన మార్పులకు దోహదపడుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు అంతరిక్షంలోకి వెళ్ళి విజయాలు సాధిస్తుంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు చాలా వెనుకబడి పోతున్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమాజాన్ని వెనక్కి లాగుతున్నాయి.వీళ్లా మన ప్రపంచ నాయకులు అని ప్రజలు రాజకీయాలనే అసహ్యించుకునేలా చేస్తున్నాయి. ప్రపంచానికే నాయకత్వం వహించే అద్భుతాలు సృష్టించే వ్యక్తులు, వ్యవస్థలు కావాలి. దానికి తగిన వ్యవస్థ కూడా రావాలి. లేకపోతే ఈ విభజన రేఖలు మరింత పెరిగి వసుదైక కుటుంబం అనే భావన కు విరుద్ధంగా దేశాల మధ్య యుద్ధాలు వస్తాయి.ప్రజల మధ్య చీలికలు వస్తాయి. వీటన్నిటికీ కారణభూతమైన విభజన రాజకీయాలు చెరిగిపోవాలి. అప్పుడే వసుదైక కుటుంబం అనే భావన నిలిచి గెలుస్తుంది.

పెరిగిన ఆర్థిక అంతరాలు:

బ్రహ్మాండమైన ఆకాశ హర్మ్యాలు ఆపక్కనే పూరి గుడిసెలు ఉన్న ఆర్థిక అసమానతలు మరింత పెట్రేగి పోయాయి. అంతరాల దొంతరలు ఇంకా కొత్తగా ఏర్పడ్డాయి. మెల్లమెల్లగా 2020 కాలగర్భంలో కలసిపోయి కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలతో మొదలు పెడదామనుకుంటే ఆ ఆశ కూడా అడియాశగా మారి పోతుందా అనిపిస్తుంది. కరోనా కొత్త రూపాన్ని సంతరించుకొని రూపాంతరం చెందింది. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతా గడగడలాడించి, బ్రిటన్ నుంచి మొదలైన కొత్త స్టయిల్ “స్టెయిన్” మానవ జీవితాన్ని మరింత గందరగోళంలోకి నెట్టి ప్రమాదం అంచున 2021 సంవత్సరం మొదలు అయింది. ప్రతి వంద  సంవత్సరాల కు ఒకసారి ఇలాంటి ఉపద్రవం ప్రపంచవ్యాప్తంగా వస్తూనే ఉంది. మానవ జీవితం వీటి ప్రభావానికి లోనవుతూనే ఎప్పటికప్పుడు కొత్త శక్తితో నిలిచి గెలుస్తూనే ఉంది. ఆ ఆశతోనే మనిషి ఈ కరోనా కష్టకాలంలో కూడా అనేక రకాలుగా జీవన పోరాటం చేశాడు. అందులో భాగంగానే ఈ కరోనా మహమ్మారికి విరుగుడు గా వాక్సిన్ కనుగొనే వేటలో పడ్డాడు.ఆ వేటలో కొంత వరకు సక్సెస్ అయినట్లు గానే ఉన్నా కూడా ఇంకా ప్రపంచ మానవాళికి  వైరస్ కి పూర్తిస్థాయి రక్షణ ఇచ్చే వ్యాక్సిన్ తయారు కాలేదు. ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఎప్పటికప్పుడు వచ్చే నెలలో వ్యాక్సిన్ వస్తుంది అని ఆశ పడుతూనే ఉన్నాము.  ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా  ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై చాలా వివాదాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా  ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా  వ్యాక్సిన్ వివాదాస్పదమైన అంశంగా మారింది. ఒకవేళ వ్యాక్సిన్ వస్తే  ప్రపంచంలోని ప్రజలందరికీ ముఖ్యంగా పేద గొప్ప తారతమ్యం లేకుండా అన్ని దేశాల వారికి అందాలి. అందుకు వసుదైక కుటుంబం అనే భావన ప్రపంచవ్యాప్తంగా రావాలి. ధనిక దేశాలు దీనికి సహకరించాలి. మన ఇంట్లో ఉన్న ఎలుకలను మాత్రమే నిర్మూలిస్తే మన బాధ తీరదు. పక్కింట్లోని ఎలకలు కూడా  మన ఇంటికి వస్తాయి. కరోనా విషయంలో దేశాల మధ్య కూడా అంతే. అందుకే అందరికీ  కరోనా వ్యాక్సిన్ “టీకా” మందు హక్కుగా మారాలి. మన తెలుగు సంవత్సరాల ప్రకారం ప్రస్తుతం శార్వరి నామ సంవత్సరం నడుస్తుంది.శార్వరి అంటే చీకటి అని అర్థం. అది మరొక మూడు నెలల తర్వాత ముగిస్తుంది. వచ్చేది “ప్లవ” నామ సంవత్సరం. ప్లవ నామ సంవత్సరం లో కరోనా నిర్మూలన జరిగి విప్లవ నామ సంవత్సరంగా మారుతుందా అనేది కాలమే తీర్పు చెబుతుంది.అందుకే ఉగాదికె ఉషోదయం అనే ఆశతో మనం ఎదురు చూస్తున్నాం.అలాఅని కరోనా  మహమ్మారి కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కాదు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సూక్తిని ప్రపంచదేశాలు పాటించాలి. మన దేశానికి వస్తే ఉగాదికి ఉషోదయం అనే మాటతో ఇప్పటికి సరి పెట్టుకుందాం! అప్పటికీ  రాకపోతే “ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలీ నందనందనా”అనే పాట పాడుకుంటూ కరోనా తో సహజీవనం చేస్తూనే కాలంతో ఎదురీదుతూ మనందరం బతకాల్సిందే కదా!!!.

బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge