Swara online radio - playing now

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్లీ ఇటీవల తెలంగాణలో కారణాలేమైనా అలాంటి ఆత్మహత్యల పరంపర పెరిగిపోతుంది. ఇటీవలనే రాష్ట్రంలో మూడు సంఘటనలు జరిగాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచిన తర్వాత తనకు తనలాంటి నిరుద్యోగులకు  కనుచూపు మేరలో ఇంకా ఉద్యోగం రాదేమోనని భయపడి ఆందోళన చెంది ఆత్మాహుతి ద్వారా ప్రభుత్వానికి సందేశం పంపుదామని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న సునీల్ నాయక్ అనే విద్యార్థి, నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే నాగార్జున సాగర్ లో ప్రైవేటు టీచర్ గా పని చేస్తున్న రవి కుమార్  ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల వ్యవధిలోనే ఆయన భార్య కూడా ఇద్దరు చిన్న పిల్లలను వదిలి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఇక మూడవ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట వృద్ధ దంపతులయిన భూషణం-ఆదిలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. తాము తమ పిల్లలు ఆర్థికంగా బాగున్నా కూడా వృద్ధాప్యంలో కన్న పిల్లలు కూడా ఊర్లో ఉంటూనే తమను పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఒంటరితనం, ఆపై అనారోగ్యంతో, ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు, పత్రికలలో, టీవీలలో చూసినప్పుడు మనసు వికలమవుతుంది. కానీ ఇలాంటి ఆత్మహత్య వెనుక ఉన్న సరైన కారణాలు తెలుసుకుంటే నివారించడానికి మార్గం సుగమమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా 20 సెకండ్ల కు ఒక ఆత్మహత్య:

1620219528811

తెలంగాణలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రపంచంలో కూడా ఆత్మహత్యలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇరవై సెకన్లకు ఒక ఆత్మహత్య, ప్రతి 2 సెకన్లకు ఒక ఆత్మహత్య ప్రయత్నం జరుగుతుందనేది ఒక సర్వే తేల్చింది. మొదటగా మనిషి ప్రాణాలు హరించడం మూడు కారణాలతో జరుగుతాయి. అందులో మొదటిది ప్రమాదాలు, రెండవది ఆకస్మికంగా వచ్చే కార్డియాక్ అరెస్ట్, లేక గుండె పోటు తో పాటు క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో మనుషులు చనిపోతారు. ఇక మూడవ పెద్ద కారణం ఆత్మహత్యలు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో రకరకాల కారణాలలో మొదటి కారణం తమ కుటుంబ గౌరవానికి సంబంధించింది. తమ వల్ల తమ కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందేమోనని భయం తో కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. అలాగే శారీరక పరమైన నొప్పులు, బాధలు భరించలేక ఆత్మహత్యలు రెండవది. ఇక మూడవది అవసరార్థం ఆదాయం కంటే మించి అప్పులు చేయడం వాటిని తీర్చలేక లేకపోవడం కూడా ఒక కారణం. నాల్గవ కారణం భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, కుటుంబ తగాదాలు, గొడవలు వీటి వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులకైతే పరీక్షల భయం, యువతకు అయితే ప్రేమ వైఫల్యం, నిరుద్యోగులకు ఉద్యోగం రాదేమోనన్న బెంగ, ఇలాంటి వాటితో పాటు సామూహిక కారణాలు కూడా ఉంటాయి. ఇంతకు ముందే చెప్పినట్లు తెలంగాణ కోసం వందల మంది యువత ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోవాలని అందులో చెన్నపట్నం మనకు రావాలని పొట్టి శ్రీరాములు కూడా 40 రోజులు నిరాహార దీక్ష చేసి ఆత్మాహుతి  చేసుకున్నారు. ఇలాంటివి కోకొల్లలు. రాజకీయ డిమాండ్ లు సాధించడానిక కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. 

పాశ్చాత్య దేశాలలోనే ఆత్మహత్యలు ఎక్కువ:

తూర్పు యూరప్ దేశాలతోపాటు Hungary, ఆసియా ఖండంలోని రష్యా లాంటి దేశాల్లో ఈ ఆత్మహత్యలు ఎక్కువ. పాశ్చాత్య దేశాలలో ఎక్కువమంది ఒంటరితనంతో చనిపోతున్నారు. రెక్కలు వచ్చిన పిల్లలు తమను విడిచి పెట్టి వెళ్లిన తర్వాత  భర్త చనిపోయిన భార్య, భార్య చనిపోయిన భర్త ఇలా ఇద్దరు ఉన్నా కూడా ఒంటరితనంతో అభద్రతాభావంతో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో కుటుంబ సంబంధాలు తక్కువగా ఉంటాయి. మీ పిల్లలు, మా పిల్లలు, మన పిల్లలు కలసి ఆడుకుంటున్నారన్న సామెత లాగ అక్కడ విడాకుల శాతం కూడా ఎక్కువే.  బలహీనమైన కుటుంబ సంబంధాల వల్ల పాశ్చాత్య దేశాలలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ మన దేశంలో కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఇప్పుడే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్నా ఇంకా మనకు తరతరాలకు ఆస్తి సంపాదించాలనే వ్యక్తిగత స్వార్థం తో నైనా కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పటిష్టమైన కుటుంబ సంబంధాలు ఉన్నాయి. దీని వల్ల ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఆత్మహత్యల శాతం తక్కువే. అయినా మరొక సర్వే ఏం చెప్పిందంటే ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య కూడా ఈ ఆత్మహత్యల శాతంలో తేడా ఉంది. మన దేశంలోనే చూసుకుంటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలోని ఆత్మహత్యలు ఎక్కువ. కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలతో పాటు బెంగళూరు,  చెన్నై దేశాల్లోఆత్మహత్యల శాతం మిగతా నగరాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది.

బలహీన మనస్కులే  ఆత్మహత్యలు  చేసుకుంటారా?

1620219529111

               ఆత్మహత్యలు చాలామంది బలహీన మనస్కులు చేసుకుంటారనే అపోహ ఒకటి ఉంది. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ధైర్యం కావాలి. అలాగే ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు ప్రపంచాన్ని గెలిచిన నియంతల లాంటి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ప్రముఖులలో మొదటగా హిట్లర్ పేరు చెప్పుకోవచ్చు. అలాగే బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. సినీ రంగంలో హాలీవుడ్ సినిమా క్లియో పాత్ర ,మార్లిన్ మన్రో, బాలీవుడ్ సినిమా తారలైన ప్రముఖ హీరో గురుదత్, హీరోయిన్ గీతాబాలే, ఇక మన తెలుగు సినిమారంగంలో ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, రంగనాథ్ అలాంటి నటులు ఉన్నారు. మన తెలుగు రాజకీయరంగంలో మాజీ హోంశాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్యల కారణాల్లో అన్ని ఒకటిగా ఉండవు. మల్టీఫ్యాక్టోరియల్ కారణాలు గా చెప్పుకోవచ్చు. అలాగే వాటిని (బయో) భౌతిక (సైకో) మానసిక (సోషల్) సామాజిక కారణాలు ఎన్నో వీటి వెనుక ఉన్నాయి.

 వంశపారంపర్య  లక్షణాలు:

అలాగే కుటుంబ వారసత్వంగా కూడా ఈ ఆత్మహత్యలు జరుగుతాయి. దీన్నే జెనిటిక్ డిజార్డర్ అంటారు. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమార్తె, కుమారుడు, వారి పిల్లలు ఇలా వేరువేరుగా అందరూ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది మూడు నాలుగు తరాలుగా జరుగుతున్న సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఇలాంటి మరణాలను జెనటిక్ డిజార్డర్ ఆత్మహత్యలు అని చెప్పవచ్చు.

ప్రధానమైన  కారణాలు  ఏమిటి?

ఆత్మహత్యలకు ప్రధానంగా నాలుగు కారణాలు చెప్పవచ్చు. అందులో మొదటిది "ఆల్టరుఇస్టిక్" ఆత్మహత్యలు. ఇవి సమాజం కోసం జరిగిన ఆత్మహత్యలు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే అంతకుముందు దేశంలో మండల్ కమిషన్ తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వందల మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండవ కారణం "అనోమికల్ సూసైడ్స్" పూలమ్మిన చోట కట్టెలు అమ్మే దుర్గతి పట్టడం వల్ల, తమ కుటుంబ గౌరవం తమ వ్యక్తిగత గౌరవం కోసం ఆత్మహత్య చేసుకుంటారు. బతికి చెడ్డ వారు తమ సోషల్ స్టేటస్ పోయిందనుకునేవారు ఇందులో ఉంటారు. ఇలాంటి వారు సమాజం తమను పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఉంటారు. సమాజ సానుభూతి కోరుకుంటారు. కానీ అది దక్కనప్పుడు కౌలు రైతులు, వ్యవసాయదారులు, చేనేత కార్మికులు ఇలా రకరకాల రంగాల వారు ఆత్మహత్యలు చేసుకుంటారు. మూడవది egoistic వ్యక్తిగత అహంభావ మనస్తత్వం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇందులో పర్సనల్ రీజన్స్ వ్యక్తిగత కారణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వైఫల్యాలు, పరీక్షలో ఫెయిల్ కావడం, భార్యాభర్తల తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇక నాలుగోది "ఫాటలిస్టిక్” సూసైడ్స్ వీటిలో జీవిత ఖైదు పడి సంవత్సరాల కొద్దీ జైలు జీవితంలో మగ్గుతున్న వారు, టెర్రరిస్ట్ క్యాంపులో, బానిసత్వ క్యాంపు లో ఉన్నవారు, ఇలా సూసైడ్ చేసుకుంటారు. ఇది కాకుండా  జీవితంలో ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్యలు ఎక్కువమంది చేసుకుంటారు. మూడు నాలుగు నెలల సమయం లోనే గోరుచుట్టు మీద రోకటి పోటు లాగా వరుస సంఘటనలు ఒక కుటుంబంలో చోటు చేసుకుంటే అవి కూడా వరుస ఆత్మహత్యలకు దారితీస్తాయి. ఉదాహరణకు మిర్యాలగూడ కు చెందిన మారుతి రావు ఆత్మహత్య ఉదంతాన్ని చెప్పుకోవచ్చు.

 ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారెవరు:

ఒంటరి పురుషులు, మహిళలు, విడాకులు తీసుకున్నవారు, ఒంటరితనంతో ఫ్రస్ట్రేషన్కు గురవుతారు. ఇలాంటి వారితో పాటు మానసిక జబ్బులు, పర్సనాలిటీ డిజాస్టర్  దూకుడు స్వభావం కలవారు సెల్ఫోన్ వత్తిడి, క్షణికావేశంతో కన్న బిడ్డలను మేడ పై నుంచి కిందికి విసిరేసే వారు ఇలాంటి వారు ఎందరో ఉంటారు. అలాగే ఆల్కహాలిక్, డ్రగ్స్ అలవాటు అయిన వారు ఆర్థిక రాజకీయ, దీర్ఘకాలిక జబ్బులయిన క్యాన్సర్, హెచ్.ఐ.వి, ఎయిడ్స్ ఇలాంటి ఆరోగ్య కారణాలతో కూడా ఎక్కువమంది ఆత్మహత్య చేసుకున్నారు.

 భావోద్వేగాల తో కూడిన ఆత్మహత్యలు:

ఇక భావోద్వేగాలు ఎక్కువగా ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. రాజకీయ భావోద్వేగాలకు తమిళనాడు పెట్టింది పేరు. ఎం.జి.రామచంద్రన్, జయలలిత, కరుణానిధి మరణాలు సంభవించినప్పుడు ఇలాగే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారు. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. అలాగే తమిళనాడు ఎన్నికలలో ఇటీవల ఒక అభ్యర్థి గెలవాలని తన నాలుకను దేవత విగ్రహం ముందు కోసుకున్న వారు కూడా ఉన్నారు.

ఆత్మహత్యలు సినిమా, టీవీ, సోషల్ మీడియా ప్రభావం:

ఆత్మహత్యలకు సామాజిక కారణాలతో పాటు సినిమా, టీవీల తో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు నలభై ఏళ్ళ క్రితం ప్రముఖ దర్శకుడు బాలచందర్ తీసిన మరో చరిత్ర ఆ తర్వాత హిందీలో "ఏక్ దూజే కే లియే" అనే పేరుతో రిలీజ్ అయింది. అందులో ప్రేమ విఫలమైన హీరో హీరోయిన్లు చివరన ఉండే క్లైమాక్స్ లో కొండ మీద నుంచి సముద్రంలో దూకి చనిపోతారు. ఈ సినిమా చూసిన తర్వాత దక్షిణ భారత దేశంలో కంటే ఉత్తర భారత దేశంలో ఎక్కువ మంది ప్రేమ వైఫల్యం తో ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక సర్వే చెప్పింది. అలాగే రకరకాల కారణాలతో చేసుకున్న ఆత్మహత్యలను ప్రస్తుత టీవీ ఛానల్ మళ్లీమళ్లీ చూపించడం వల్ల కూడా కొత్త వారిని ఆత్మహత్యలకు పురిగొల్పిన వారవుతున్నారని ఆరోపణ వాటిపై ఉంది. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువ మంది ఆత్మహత్యలకు ప్రేరేపితం అవుతున్నారు. ఆత్మహత్యల నివారణ లో ప్రస్తుతం నేటి యువత మీద అత్యధిక ప్రభావం చూపించే సినిమాలు, టీవీ, సోషల్ మీడియా పాత్ర ఎక్కువగా ఉండాలి. సాధ్యమైనంతవరకు ఆత్మహత్యలను టీవీ  సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయకూడదు. అలాగే పత్రికలలో ఆ సంఘటనను ఏదో మారుమూల మాత్రమే ప్రచురించాలి. ఇలాంటి విషయాలను ఎక్కువగా ప్రచారం చేయకూడదు.

ఆత్మహత్య మహాపాపం. మతాలు ఏం చెబుతున్నాయి:

ఆత్మహత్యలకు మతం తో కూడా సంబంధం ఉంది. కొన్ని మతాలలో ఆత్మహత్యల శాతం చాలా తక్కువ. ఉదాహరణకు మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే ఇస్లామిక్ దేశాలలో ఆత్మహత్యలు చాలా తక్కువ గా చేసుకుంటున్నారు. వారి మత గ్రంథమైన ఖురాన్ లో ఆత్మహత్యలను పూర్తిగా నిషేధించారు. కనుక అక్కడ ఆత్మహత్యలు తక్కువగా ఉన్నాయి. అలాగే కమ్యూనిస్టు దేశాలలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువ అని కూడా మరొక సర్వే తేల్చింది.  చైనా రష్యా లాంటి దేశాల్లో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంది. మన భారతదేశంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారు ఎక్కువ మంది ఉంటారు కనుక ఇక్కడ కూడా మిగతా పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే ఆత్మహత్యల శాతం తక్కువని మరొక సర్వే చెబుతోంది.

1620219528666

సమస్య వర్ణన కాదు పరిష్కారం చూపాలి:

ఇవన్నీ సమస్యలను వర్ణించడమే అవుతుంది. సమస్య పరిష్కారం వైపు పోవాలంటే ముందుగా ఆత్మహత్య చేసుకుందామనుకున్న వారి మానసిక స్థితిని మనం అధ్యయనం చేయాలి. అందులో మొట్టమొదటి "వార్నింగ్ సైన్" అంటారు. అంటే ఆత్మహత్యలు చేసుకునే వారి ప్రవర్తనలో ఆత్మహత్య చేసుకునే కన్నా ముందుగా పెద్ద మార్పు వస్తుంది. అందులో వారు మూడీగా, లేక డల్ గా, విచారంగా ఉంటారు. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, శరీరం పట్ల మానసికంగా కూడా కేర్ లెస్ గా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు గడ్డం బాగా పెంచడం,  ఎన్నడూ డైరీ రాసే అలవాటు లేనివారు కూడా డైరీ రాస్తారు. కుటుంబ సభ్యులకు తాము ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోగానే అప్పగింతలకు పూనుకుంటారు. తమకు ఇష్టమైన వస్తువులు ఎవరెవరికి ఇవ్వాలో చెబుతారు. మరికొందరు వీలునామా కూడా రాసి పెడతారు. ఇలాంటివన్నీ మనం ముందు గుర్తించాలి. అలాగే ఆత్మహత్య చేసుకునే వారి నోటి వెంట వేదాంతపరమైన మాటలు వస్తాయి. విషాద గీతాలు పాడుతుంటారు. అలాగే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటారు. నిద్రమాత్రలు  డ్రగ్స్ తీసుకుంటారు. మొత్తం మీద వారి ప్రవర్తనలో కారు బైకు ఎక్కువ స్పీడ్ తో నడిపించడం ఇలాంటి "రెక్ లెస్" బిహేవియర్ జీవితం పట్ల, ప్రాణం పట్ల నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. ఆత్మహత్యలు చేసుకునే వారి ఇలాంటి ముందస్తు ప్రవర్తనలు గుర్తిస్తే ఆత్మహత్యలు చాలావరకు నిరోధించవచ్చు.

ఆత్మహత్యల నివారణకు పరిష్కార మార్గాలు:

ఆత్మహత్యల నివారణకు పరిష్కార మార్గాలు ఆలోచిద్దాం. సంతోషాన్ని పంచుకుంటే రెండింతలవుతుంది. దుఃఖాన్ని పంచుకుంటే ఆ దుఃఖంలో సగం అవుతుందనేది ఒక ప్రసిద్ధ సామెత. ఆత్మహత్య చేసుకుందామనుకునే లక్షణాలు కలిగిన వారిని ఒంటరిగా విడిచి పెట్టొద్దు. భవిష్యత్తు పట్ల ఆశ పెంపొందించేలా "హోప్ క్రియేట్" చేయాలి. వారు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి ఆప్షన్స్, ఆల్టర్నేటివ్ మార్గాలు చాలా ఉన్నాయని చూపించాలి. ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సహ అనుభూతి వారితో పంచుకో గలగాలి. వారి ఆత్మహత్యతో కుటుంబం ఎలా నష్ట పోతుందో వారికి వివరించాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్యకు పూనుకునే వారిలోని లక్షణాలు గుర్తించి వారిని వెంబడించి వారికి అవసరమైన మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. వారికి స్వాంతన చేకూర్చే మాటలను చేతలను ఆచరణలో చూపెట్టాలి. అలాగే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉపయోగిస్తున్న పద్ధతులు ఒకటి పురుగు మందు తాగడం  రెండవది ఉరి వేసుకోవడం  మూడోది మంటల్లో దేహాన్ని కాల్చుకోవడం. ముఖ్యంగా మొదటి కారణమైన పురుగుమందులను ఇంట్లో ఉండకుండా చూసే ప్రయత్నం చేయాలి. కొన్ని దేశాల్లో పెస్టిసైడ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఆ దేశాల్లో రైతుల ఇళ్లల్లో పురుగు మందులు ఉండవు. దానికి కారణం ఏమిటంటే ఆత్మహత్యలు మాత్రమే కారణం కాదు ఇంట్లో పిల్లలు తెలిసీ తెలియక ఆ పురుగుమందులను స్వీకరిస్తే చచ్చిపోతారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఇలాంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ సామూహిక గోడౌన్స్ లో బ్యాంకులో లాకర్లు ఉన్నట్లు పురుగుమందులు పెట్టుకోవడానికి లాకర్లు ఏర్పాటుచేసి వారికి దానికి సంబంధించిన తాళపు చెవులు అప్పగిస్తారు. అవసరమైనప్పుడు అక్కడి నుంచి పురుగు మందు తీసుకుని పొలాల్లో చల్లిన తరువాత మిగిలిన పురుగుమందులను మళ్లీ లాకర్ లో  దాచి పెడతారు. అలా దాచుకోవడానికి లాకర్ లకు నామమాత్రపు అద్దె వసూలు చేస్తారు. దానివల్ల ఇంట్లో పురుగు మందులు ఉండవు. ఇక రెండవది ఆర్గానిక్ పెస్టిసైడ్ వాడకం కూడా ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇక ఆత్మహత్యలు చేసుకుందామనుకునే వారి మనస్తత్వాన్ని పసిగట్టి వారి గదిలో కత్తులు, కటార్లు, తాళ్లు, అగ్గిపెట్టెలు ఇలాంటివి ఉండకుండా చూడడం మరొక జాగ్రత్త. ఆత్మహత్యలు చేసుకోవడానికి డైలమాలో ఉన్న వారికి చివరికి నిర్ణయం తీసుకునే దాకా ఉన్న సమయాన్ని "గోల్డెన్ అవర్" అంటారు. అప్పుడు కుటుంబ సభ్యులు గాని మిత్రులు కానీ కలిగించుకొని ఆత్మహత్యలు చాలావరకు ఆపవచ్చు. ఎంత ఆపినా కూడా 100 శాతం ఆత్మహత్యలు ఆపడం సాధ్యం కాదు. దానికి సమాజమే నడుం కట్టవలసి ఉంటుంది. అందులో భాగంగా ఆత్మహత్యలు జరగకుండా హెల్ప్ లైన్ లు, సహాయ కేంద్రాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. మనదేశంలో హైదరాబాద్ లాంటి నగరాలలో స్నేహ, ఆసరా, రోషన్ లాంటి సంస్థలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉన్న వారు ఈ సంస్థ వారితో టోల్ ఫ్రీ నెంబర్ లో సంప్రదిస్తే సరైన మానసిక ధైర్యాన్ని ఇస్తారు. అలాగే దేశంలో అనేకం స్వచ్ఛంద సంస్థలు కూడా ఆత్మహత్య నిరోధానికి సరైన సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ 306 సెక్షన్  ఆత్మహత్యలకు పురిగొల్పిన వారిపై చర్యలకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. ఆత్మహత్య ప్రయత్నం చేసి విఫలమైన వారి మీద గతంలో ఐపీసీ 309 సెక్షన్ ప్రకారం కేసు పెట్టేవారు. అందులో ఒక సంవత్సరం జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించే వారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారిని సానుభూతితో ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారి మీద కేసులు తీసివేశారు. దాంతో సెక్షన్ 309 నిర్వీర్యం అయిపోయింది. మన ప్రమేయం లేకుండా మనము ఈ భూమి మీదికి వచ్చాము. ఈ విలువైన జీవితాన్ని మనం అర్ధాంతరంగా ముగించ వద్దనే భావన కలిగించాలి. జీవించాలనే కోరికను మరింత బలంగా కలిగించే ప్రయత్నం చేయాలి. దీనికి అలోపతిలో లిథియం కార్బోనేట్ లాంటి మందులు కూడా ఉన్నాయి. కానీ వాటి కంటే బలమైన మందు సామాజిక చైతన్యము, మానసిక ధైర్యం మాత్రమే సరైన మందు.

 "కల కానిది, విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు" అన్న మహాకవి శ్రీశ్రీ గారి పాటలో "అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే" అనే బతుకు మీద ఆశ పుట్టించే ఆణిముత్యాల్లాంటి చరణాలను గుర్తు చేసుకుంటే చనిపోయే వాడికి కూడా బతకాలని అనిపిస్తుంది.

-బండారు రామ్మోహనరావు.

 సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge