Swara online radio - playing now

అందరి ఆశాదీపం హైదరాబాద్

హైదరాబాద్ ఇమేజ్ ను కాపాడుకుందాం! హైదరాబాదీగా గర్విద్దాం!!

-బండారు రామ్మోహనరావు.

రోమ్ నగరం ఒక్క నాడే నిర్మితం కాలేదు అన్న సామెతకు అనుగుణంగానే హైదరాబాద్ నగరం కూడా ఒక్కరోజులోనే  నిర్మాణం కాలేదు. 1591లో పురుడు పోసుకున్న ఈ నగరం నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తో కోటికి పైగా జనాభాతో విరాజిల్లుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు అంచలంచలుగా అభివృద్ధి చెందింది. ఒక్కొక్క సంక్షోభం ఏర్పడినప్పుడు ఆ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఎప్పటికి అప్పుడు అప్పటి పాలకులు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు. మౌలిక సౌకర్యాల ఏర్పాటు చేశారు.

జనారణ్యంగా హైదరాబాద్:

ఒకనాడు చార్మినార్ కేంద్రంగా నాలుగు వైపులా రోడ్లు ఏర్పాటు చేసి స్థాపించిన హైదరాబాద్ నగరం ప్రస్తుతం కొన్ని వేల కిలోమీటర్ల నిడివి గల రోడ్లతో జనారణ్యం గా మారింది. జనాలకు తగ్గట్టుగా సౌకర్యాలను కూడా అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. భారతదేశానికి స్వాతంత్ర్యానికి పూర్వమే ఒక దేశానికి రాజధాని కావాల్సిన లక్షణాలు సౌకర్యాలతో మన హైదరాబాద్ నగరం ఉంది. పాలనా కేంద్రంగా చట్టసభల కోసం అసెంబ్లీ హాలు, జూబిలీ హాలు, వైద్య చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రి, యునానీ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, పిల్లల కోసం నీలోఫర్ ఆసుపత్రి తో పాటు ప్రసూ తుల కోసం కోటి లోని జెజిఖానా ఆస్పత్రి,వేట బురుజు ఆస్పత్రి ఇవన్నీ ఆనాటి పాలకులు దూరదృష్టితో నిర్మించినవే. అలాగే చదువుల కోసం సిటీ కాలేజీ తో పాటు మహబూబియా కాలేజీ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వరకు అనేక కళాశాలలు హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేశారు. ఆనాడే మార్కెట్ కోసం మోజామ్ జాహి మార్కెట్, మదీనా బిల్డింగ్ తో పాటు అనేక వాణిజ్య వ్యాపార సముదాయాలు నిర్మితమయ్యాయి. వ్యాపారపరంగా ముత్యాల నగరంగా నిజాం కాలంలోనే తోటల నగరంగా హైదరాబాద్ ఆనాటి నుండి ఈనాటి వరకు పేరుగాంచింది.

మాడపాటి బహు ఘనాపాటి, మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు:

ఆధునిక భారతదేశంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడిన తర్వాత 1951 లో అప్పటి ఆంధ్ర మహాసభ నుండి స్వాతంత్ర సమరయోధుడు మాడపాటి హనుమంతరావు మొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత2007 లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటయ్యే వరకు మొత్తం 22 మంది మేయర్లు ఎన్నికై పనిచేశారు. 2002 లో  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ తెలుగుదేశం పార్టీ నుండి తీగల కృష్ణారెడ్డి ప్రధాన అభ్యర్థులుగా పోటీచేయగా తీగల కృష్ణా రెడ్డి గెలిచారు. మొత్తం ఎంసిహెచ్ చరిత్రలో 2002 నుండి 2007 వరకు ఐదేళ్లు పూర్తిస్థాయిలో పనిచేసిన మేయర్ తీగల కృష్ణారెడ్డి మాత్రమే. 

ఎం సి హెచ్ లో ఇద్దరు మహిళా మేయర్లు:

ఎం సి హెచ్ పరిధిలో మహిళ మేయర్ గా గెలిచిన వారిలో మొదటి మహిళా  మేయర్ గా రాణి కుముదిని దేవి,1961-62 పని చేశారు. ఆ తర్వాత 1964-1965 లో సరోజిని పుల్లారెడ్డిఎన్నికయ్యారు. మొత్తం 60 ఏళ్ల ఎం సి హెచ్ చరిత్రలో ఇద్దరు  మహిళలు మాత్రమే మేయర్లు గా ఎన్నికయ్యారు.

జిహెచ్ఎంసి మేయర్ ల చరిత్ర

జిహెచ్ఎంసి  మొట్టమొదటి మహిళ మేయర్ కార్తీకరెడ్డి

ఇక 2007లో జిహెచ్ఎంసి ఏర్పడ్డ తర్వాత మొత్తం రెండు టర్మ్ లలో  కలిసి  ముగ్గురు మేయర్ లు గా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన జిహెచ్ఎంసి మేయర్ పదవికి పరోక్ష ఎన్నికల మూలంగా మొదటి సారి కాంగ్రెస్ పార్టీ నుండి 2009 నుండి 2011 వరకు బండ కార్తీక రెడ్డి మొట్టమొదటి మహిళా మేయర్ గా ఎన్నికై పని చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ పార్టీ  పొత్తు మూలంగా ఏర్పరచుకున్న  అవగాహన మేరకు రెండున్నర ఏళ్ల తర్వాత ఎంఐఎం కార్పొరేటర్ మజీద్ హుస్సేన్ కు మేయర్ పదవి అప్పగించాల్సి వచ్చింది. ఆయన 2011 నుంచి 14 వరకు మరో రెండున్నర ఏళ్లు మేయర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 2016లో  జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగాయి.ఎంసిహెచ్ పరిధిలో పూర్తి స్థాయి ఐదు ఏళ్ళు మేయర్ గా పని చేసిన వ్యక్తి తీగల కృష్ణా రెడ్డి కాగా, జి హెచ్ ఎం సీ పరిధిలో మేయర్ గా పూర్తిస్థాయి  ఐదేళ్ళు పని చేసిన వ్యక్తి బొంతు రామ్మోహన్ గా చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరి హయాంలో హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. కానీ అందులో లెక్కించదగినవి కొన్ని మాత్రమే. జనావాసం పెరిగిన కొద్దీ మౌలిక సౌకర్యాలు పెరిగిన కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రధానమైన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు

హైదరాబాద్ మంచినీటి కథ:

ఒకనాడు మంచినీటి అవసరాల కోసం నిజాంల కాలంలో ప్రస్తుత హుసేన్ సాగర్ చెరువు నీళ్లను వాడేవారు. 1908లో హైదరాబాద్ నగరానికి మూసీ నది వరదలు వచ్చిన తర్వాత ఆ సంక్షోభానికి పరిష్కారంగా 1920లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట మంచినీటి చెరువులను నిర్మించారు.ఆ తర్వాత హైదరాబాదు నగర అభివృద్ధి చాలా వేగవంతమైంది.అప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న మంజీరా నది మీదమొదట మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణం పక్కనే గల కల్పగూరు గ్రామ శివారులో మంజీర  డ్యాం నిర్మించారు. ఆ తర్వాత 1970వ దశకం లో మంజీరా నది మీదనే నిర్మించిన మంజీరా డామ్ కు నలభై కిలోమీటర్ల పైన సింగూరు డ్యాము ను నిర్మించారు. సుమారు 29 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగిన సింగూరు డ్యాం ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా జరిగింది. ఆ తరువాత ఆ నీరు కూడా సరిపోకపోవడంతో కృష్ణా నది మీద నాగార్జునసాగర్ దగ్గరలోని ప్రాంతం నుండి వరుసగా ఒకటి వెంట ఒకటి మొత్తం మూడు పైపులైన్లు వేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఆ తర్వాత ఆ నీరు కూడా సరిపోకపోవడంతో గోదావరి నది మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మంచిర్యాల మధ్యన 20 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి మరొక పెద్ద పైప్ లైన్ వేసి హైదరాబాద్ ఉత్తర ప్రాంతానికి మంచి నీరు అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాదుకు నలభై కిలోమీటర్ల దూరంలో నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి  హైదరాబాద్ ఉత్తర శివార్లలోని కేశవాపూర్ వద్ద  మరొక ఇరవై టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఒక పెద్ద రిజర్వాయరు నిర్మించి ఆలోచనతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.ఇది హైదరాబాద్ మహానగర మంచి నీటి సరఫరా సంగతి.

అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో హైదరాబాద్:

ఇక అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు  ఐటీలో బెంగుళూరు నగరాన్ని తలదన్నే  విధంగా  సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుకు ఐటీ రంగ విస్తరణకు హైదరాబాద్ పడమటి శివారులో హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. ఆయన హయాంలోనే హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పురుడుపోసుకుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు తోపాటు మెట్రోరైలు ఆలోచన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేశారు. ఆ తర్వాత 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అలాగే అవుటర్ రింగ్ రోడ్డు మెట్రో రైలు పనులు మొదలు పెట్టబడి ఔటర్ రింగ్ రోడ్డు రూపుదిద్దుకుంది. మెట్రో రైలు  పనులు ఆయన హయాంలోనే 40 శాతం వరకు పూర్తికాగా ఆ తర్వాత ఆయన మరణానంతరం కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు ప్రాజెక్టు దాదాపుగా  పూర్తయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం మరింత విస్తరించింది. మరి ఎన్నో మౌలిక సౌకర్యాలను సంతరించుకుంది .ఎన్నో ఫ్లైఓవర్ లను నిర్మించుకుంది. దుర్గం చెరువు మీద వంతెన ఇవాళ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రోజురోజుకు హైదరాబాదు నగరం సోయగాల సొగసులద్దుకుంటూ నివాసయోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటూ వన్నె చిన్నెల నగరంగా ఎదుగుతుంది.

నవ యువతకు "ఆశాదీపం" హైదరాబాద్:

1956లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ మారింది. మౌలిక వసతుల ఏర్పాటుతో 1980 తర్వాత హైదరాబాదు నగరానికి వలసలు పెరిగాయి. ఆ తర్వాత ఆరోగ్య రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది అనేక  కార్పొరేట్ ఆసుపత్రులు ఇక్కడికి వచ్చాయి ఐటీ రంగ విస్తరణతో ఉద్యోగ అవకాశాలు పెరిగి  అమలాపురం నుండి అమీర్ పేట వచ్చి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని అమెరికాకు చెక్కేసిన యువత లక్షల సంఖ్యలో ఉంటారు అలా గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగ యువతకు ఒక ఆశా దీపంగా మారింది.

హైదరాబాద్ ఇమేజ్ ను కాపాడుకుందాం!

విద్యా రంగంలో కూడా అనేక కార్పొరేట్ కాలేజీలు ఇక్కడ ఏర్పాటు అయ్యాయి. ప్రభుత్వ రంగంలో కూడా అనేక యూనివర్సిటీలు స్థాపించబడ్డాయి. ఆరోగ్య రంగ రాజధానితోపాటు విద్యారంగ రాజధానిగా కూడా హైదరాబాద్ ఎదిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా హైదరాబాద్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కలకత్తా ముంబై చెన్నై కి లేని అవకాశాలు హైదరాబాద్ బెంగళూరు నగరాలకు ఉన్నాయి. పై మూడు నగరాలకు పక్కన సముద్రం ఉండటం వల్ల అక్కడ ఒక పక్క నగరం విస్తరించడానికి అవకాశం లేదు. భౌగోళికంగా హైదరాబాదు బెంగళూరు నగరాలు చుట్టూ ఎటు పడితే అటు విస్తరించడానికి అనువుగా ఉన్నాయి.అందుకే ఈ రెండు నగరాలు ప్రపంచంలో వేగవంతంగా విస్తరిస్తున్న నగరాల్లో నిలిచాయి. భౌగోళిక పరంగా ఉత్తర దక్షిణ భారతదేశానికి వారధిగా ఉన్న హైదరాబాద్ నగరం భాషా పరమైన సమస్య కూడా లేకుండా ప్రపంచంలోని అన్ని మతాల వారిని అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంది. దక్కన్ పీఠభూమి శిఖరాగ్రం పై ఉన్న హైదరాబాద్ నగరం భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తుల కు కూడా దూరంగాఉంది. ప్రపంచంలోని నివాసయోగ్యమైన నగరాలలో ఒకటిగా ఉండడంవల్ల అనేక ప్రపంచవ్యాప్త కంపెనీలు తమ అతిపెద్ద యూనిట్లు హైదరాబాదులో లో స్థాపించారు. అమెజాన్ మొదలుకొని ఫేస్బుక్, గూగుల్ లాంటి పెద్ద సంస్థలు తమ రెండవ అతిపెద్ద వ్యాపార కార్యకలాపాలను హైదరాబాదు కేంద్రంగా విస్తరించారు. గత 40 ఏళ్లుగా మతకలహాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న నగరంగా కూడా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది. ఇలా అన్ని రకాలుగా హైదరాబాద్ తన ఇమేజ్ ను నిలుపుకుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు భారత దేశ వ్యాప్తంగా హైదరాబాదుకు వచ్చి స్థిరపడిన అందరి జ్ఞాపకాలు హైదరాబాదుతో ముడిపడి ఉన్నాయి. చిల్లర మల్లర రాజకీయ పార్టీల వివాదాల సుడిగుండంలో హైదరాబాద్ నగర విశిష్టత ను కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాబాహుళ్యానికి ఉంది. విజ్ఞత గల హైదరాబాద్ పౌరులు ఇప్పటిదాకా "గంగా జమున తహజీబ్" ను కాపాడారు. ఇది ముందు ముందు కూడా కొనసాగుతుందని ఆశిద్దాం. హైదరాబాద్ నగర పౌరులుగా హైదరాబాదీలు గా తలెత్తి గర్వంగా చెప్పుకుందాం. 

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge